మోడీ దేశాన్ని అమ్మేస్తారు
బిజెపి నినాదం బేచో ఇండియా ...టీఆర్ఎస్ నినాదం సోచో ఇండియా
బిజెపి వాళ్ళు చార్మినార్..గోల్కొండను కూడా అమ్మేస్తారు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫస్ట్ మేం..సెకండ్ ఎంఐఎం
మంత్రి కెటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తే పెట్టుబడుల ఉపసంహరణ కింద చార్మినార్, గోల్కొండలతోపాటు జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం బేచో ఇండియా నినాదం అందుకున్నారని..దేశాన్ని ఆమ్మేస్తున్నారని ఆరోపించారు. తమది సోచో ఇండియా నినాదం అని తెలిపారు. కెటీఆర్ మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి వేసిన ఛార్జ్ షీట్ పై స్పందించారు. ఎయిర్ ఇండియా అంటే నష్టాల్లో ఉన్నది కాబట్టి అమ్మేస్తున్నాం అంటారు..మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్మేస్తున్నారంటే మాత్రం నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వ అసమర్ధ, ఆర్ధిక విధానాల వల్ల దేశ ఆర్ధిక రంగం కుదైలైపోయిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫస్ట్ తామే ఉంటామని..రెండవ ప్లేస్ లో మజ్లిస్ ఉంటుందని తెలిపారు. తర్వాత స్థానాల్లో ఎవరుంటారో తమకు తెలియదని వ్యాఖ్యానించారు. తమ పోటీ ఎంఐఎంతోనే అన్నారు. మేయర్ పక్కాగా టీఆర్ఎస్ కు సంబంధించిన మహిళా అభ్యర్ధే ఉంటారన్నారు.
కరోనాకు ముందు ఎనిమిది త్రైమాసికాల నుంచే దేశ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా పతనం అయిందని తెలిపారు. ఈ పతనాన్ని కూడా దేవుడి మీద నెపం నెట్టిన '(యాక్ట్ ఆఫ్ గాడ్) అన్నందుకు బిజెపి మీద ఛార్జ్ షీట్ వేయాలన్నారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా దేశంలో వలస కూలీల ఆత్మహత్యలకు కారణమైనందున వారి ఆత్మలు ఛార్జ్ షీట్ వేయాలన్నారు. కూలీలకు రైళ్ళు పెట్టి వాళ్ల దగ్గర కూడా మానవత్వం లేకుండా ఛార్జీలు వసూలు చేయమన్నవారిపై, 20 లక్ష్లల కోట్ల ప్యాకేజీ పేరుతో మాయ చేసినందుకు ఛార్జ్ షీట్ వేయాలన్నారు. అసలు 20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కేంద్ర మంత్రులకు తెలుసా? అని కెటీఆర్ ప్రశ్నించారు. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల బాగుపడ్డ ఓ 20 మందిని చూపించాలన్నారు.
పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నందుకు, నల్లధనం వెనక్కి తెప్పిస్తామన్నందుకు, దేశంలోని బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసిందుకు, బ్యాంకులను నిలువునా ముంచిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా తదితరులు దేశం నుంచి పారిపోవటానికి పరోక్షంగా సహకరించినందుకు ఛార్జ్ షీట్ వేయాలన్నారు. జమ్మూకాశ్మీర్ లో పీడీపీతో పదవులు పంచుకున్నది బిజెపినా కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై వేసిన ఛార్జ్ షీట్ లో టీఆర్ఎస్, ఎంఐఎం సర్కారు అని ప్రస్తావించారని..కేంద్ర మంత్రికి ఆ మాత్రం కూడా తెలియదా? అని ప్రశ్నించారు. తాము సొంతంగానే ఉన్నామని..తమకు భాగస్వాములు ఎవరూ లేరన్నారు. నల్లధనం తెస్తామని చెప్పి..రైతులను దెబ్బతీసే నల్లచట్టాలు తెచ్చారని..కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు బిజెపిపై ఛార్జ్ షీట్ వేయాలన్నారు. హాథ్రాస్ లో ఆడబిడ్డపై అత్యాచారం చేసి..ఆమె చనిపోతే కుటుంబ సభ్యులకు తెలియకుండా అంత్యక్రియలు జరిపినందుకు, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా డీజిల్, పెట్రోలో రేట్లు పెంచినందుకు ఇలా ఎన్నో అంశాలపై ఛార్జ్ షీట్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు.