Telugu Gateway
Politics

మోడీ కామెంట్స్ చర్యల కోసమా..రాజకీయం కోసమా!

మోడీ కామెంట్స్ చర్యల కోసమా..రాజకీయం కోసమా!
X

తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికల ముందు గందరగోళంలో పడిపోయిన వేళ ప్రధాని మోడీ మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో పాటు కెసిఆర్ సర్కారు అవినీతిపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు తమను నమ్మే అవకాశం లేదు అని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తూ వస్తున్నారు. మోడీ నేరుగా ముఖ్యమంతి కెసిఆర్ పేరు తీసుకుని మరీ మంగళవారం నాడు భోపాల్ లో విమర్శలు చేశారు . అంతే కాదు కెసిఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రజలు బాగుండాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. అయితే మోడీ మాటలను చూసి ఒక అంచనాకు రావటం చాలా కష్టం అని..ఎందుకంటే బీజేపీ ఈ అంశాన్ని ఒక రాజకీయ నినాదంగా వాడు కుంటుంది తప్ప....ప్రధాని మోడీ ప్రకటన చూసి వెంటనే కవిత ను అరెస్ట్ చేస్తారు...కెసిఆర్ విషయంలో దూకుడుగా ఉంటారు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు అని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకు ఇదే నినాదాన్ని వాడుకుంటారు తప్ప..ఎలాంటి చర్యలు ఉండే అవకాశం లేదు అని చెపుతున్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కూడా అటు ప్రధాని మోడీ, ఇటు బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా లు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. అప్పటిలో సీఎం చంద్రబాబు కు పోలవరం ఏటిఎంగా మారింది అంటూ విమర్శలు గుప్పించారు.

తర్వాత పార్లమెంట్ లో మాత్రం ఎలాంటి అవినీతి జరగ లేదు అని ప్రకటించారు. ఇప్పుడు మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏమి అడిగితే అది ఆగమేఘాలమీద చేసిపెడుతున్న కేంద్రం, బీజేపీ ఇప్పుడు ఆయనపై కూడా తీవ్ర అవినీతి విమర్శలు చేస్తోంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా...జె పీ నడ్డా లు జగన్ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది అని ఆరోపించారు. ఎక్కడికి పోయినా అదే క్యాసెట్ వేస్తారు కానీ...ఎలాంటి యాక్షన్స్ మాత్రం ఉండవు. ఇప్పుడు కెసిఆర్ కుమార్తె కవిత విషయంలో కూడా అదే జరుగుతుంది అని...ఇది ఒక రాజకీయ నినాదంగా వాడుకుంటారు తప్ప ఇప్పటికిప్పుడు ఏమి చేసే ఛాన్సులు లేవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు కచ్చితంగా ఎంతో కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకావం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. చూడాలి రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు ఇంకా ఎన్ని విచిత్రాలు చేస్తారో.

Next Story
Share it