Telugu Gateway
Politics

మోడీ ఎందుకిలా?!

మోడీ ఎందుకిలా?!
X

ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రధాని మోడీ భయపడుతున్నారా..లేక సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారా?. ఆయన డైలాగులు చూసిన వారికి ఎవరికైనా ఇదే సందేహం రావటం ఖాయం. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా మోడీ నుంచి వచ్చే డైలాగులు మాత్రం ఏమీ మారటం లేదు. అందుకే అయన స్క్రిప్ట్ రైటర్ ను మార్చరా అని రాజకీయ నేతలు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. పలు కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ కి ఎటిఎం లాగా మారింది అంటూ ఆరోపించారు. అంతే కాదు...తనకు సమాధి తవ్వాలని చూస్తారు అని...తనపై కుట్రలు చేస్తారు...వెంటాడుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మూలంలోనే అవినీతి ఉంది..అదే వారి శ్వాస ఉంటూ విమర్శలు గుప్పించారు. గతంలో కూడా మోడీ ఇదే తరహాలో సమాధి తవ్వుతారు అంటూ కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూస్తే మోడీది అంతా పాత స్క్రిప్ట్ అనే విషయం అర్ధం అవుతోంది. గతం లో ఒకసారి కాంగ్రెస్ నేత ఒకరు తనను అంతమొందించేందుకు పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకు సుపారీ ఇచ్చారు అని మోడీ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రధాని హోదా లో ఈ మాటలు మాట్లాడి తర్వాత ఆ విషయాన్నీ పూర్తిగా వదిలేశారు. అంటే కేవలం రాజకీయం కోసం...ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదే మోడీ తన తొలి టర్మ్ లోనూ అప్పటిలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ పై కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ తెలుగు దేశం ప్రభుత్వానికి ఎటిఎం లా మారింది అంటూ ఇదే డైలాగు చెప్పారు. ఒక వైపు దేశంలోని ప్రతిపక్ష పార్టీ లు అన్ని కేంద్రంలోని విచారణ సంస్థలను అడ్డంపెట్టుకుని మోడీ సర్కారు తమను వేధిస్తుంది అని ఆరోపణలు చేస్తున్న తరుణంలో అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రధాని మోడీ కూడా ఇప్పుడు నన్ను వెంటాడుతారు...కుట్రలు పన్నుతారు వంటి బేల మాటలు మాట్లాడుతున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం తేలిపోయిందా అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు మోడీ ఈ నెల 18 న ఎన్ డీఏ సమావేశం ఏర్పాటు చేశారు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మోడీ ఈ వ్యాఖ్యల ద్వారా తాను బలవంతుడికి కాను...బలహీనుడిని అని చెప్పుకున్నట్లు ఉంది అని అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it