మోడీ బెంగుళూరు పర్యటన..75 కాలేజీలకు సెలవులు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై కర్ణాటక సర్కారు పలు జాగ్రత్తలు తీసుకుంది. ఆగ్నివీర్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో మోడీ పర్యటన కారణంగా ఏకంగా 75 కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇవి ప్రధాని మోడీ పర్యటన మార్గంలో ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్లు చెబుతున్నారు.
సోమ, మంగళవారాల్లో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. త్వరలోనే కర్ణాటకలో ఎన్నికలు ఉండటంతో బిజెపి ఫోకస్ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో బిజెపినే అధికారంలో ఉన్నా..ఆ పార్టీ ఇప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటోంది అక్కడ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. జెడీఎస్ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రధాని పర్యటన కారణంగా అధ్వాన్నంగా ఉన్న కొన్ని బెంగుళూరు రోడ్లు కూడా బాగుపడ్డాయి.