Telugu Gateway
Politics

వైసీపీది దిక్కుమాలిన పాలన

వైసీపీది  దిక్కుమాలిన  పాలన
X

ఏపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీది దౌర్భాగ్యపు… దిక్కుమాలిన పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు. ఇలాంటి దాష్టికపు పాలన మన దేశంలో ఎక్కడా లేద‌న్నారు. పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్ధులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారు. వైసీపీ దాష్టిక పాలన చూసి ఓపిక నశించింది. 151 మంది గెలిచారు. మంచి పాలన అందిస్తారని అనుకున్నాం కానీ దాడులు, బెదిరింపులతో పాలన చేస్తున్నారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి... క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం. ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటామ‌ని తెలిపారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ఫలితాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని కలిగించాయ‌న్నారు. పరిషత్ ఎన్నికలు నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ జరిగిన విధానం చాలా బాధ కలిగించింది. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నామని మాటలు చెప్పిన ప్రభుత్వం... మరో వైపు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడింద‌ని మండిప‌డ్డారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు.

ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై... మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచాం.అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు. గెలుపొందింది 177. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మా పార్టీ మద్దతుతో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే... పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన స్థానాలు గెలుపొందిన స్థానాలను ప్రాతిపదికన తీసుకొని ఈ విషయం చెబుతున్నాం. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో రెండు స్థానాల్లో మా అభ్యర్థులు గెలిచారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నాం. పవర్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక సూత్రాలకు నిలబడి సాధించిన ఈ విజయం బలమైన మార్పుకు సంకేతం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలే గెలిచింది. కానీ ఆ గెలుపు మార్పుకు సంకేతం. ఈ రోజు వాళ్లే తెలంగాణలో విజయబావుట ఎగరవేశారు. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజు మా జనసేన విజయం చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ సంపూర్ణ మార్పుకు ఇది బలమైన పాదముద్ర అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it