Telugu Gateway
Politics

జగన్ తల్చుకుంటే హైకోర్టు సీజేలే క్షణాల్లో బదిలీ అవుతారు

జగన్ తల్చుకుంటే హైకోర్టు సీజేలే క్షణాల్లో బదిలీ అవుతారు
X

అలాంటి వ్యక్తితో గెరిల్లా వార్ ఫేర్ కు ఎవరైనా సాహసిస్తారా?

లోపం మీ లోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులే క్షణంలో బదిలీ అవుతారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఏపీలో దేవాలయాల్లో జరిగే దాడులకు సంబంధించి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు గెరిల్లా వార్ ఫేర్ అంటూ సీఎం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. ఇవి ఆయన స్థాయికి తగిన మాటలు కావన్నారు. రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయి. రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. జరుగుతున్న ఈ ఆరాచకంపై మాట్లాడితే ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించటం తగదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు. మీరు ఎంతటి శక్తిమంతులో ఈ దేశ ప్రజలందరికి తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐ.పి.ఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్.పి.లు వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది.

నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ పైన, సోషల్ మీడియాలో మీపైన, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు. ఊరికో వాలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు కదా .. వారు కూడా సమాచారం ఇవ్వలేకపొతున్నారా? ఎక్కడ వుంది లోపం? మీలోనా? మీ నీడలో వున్న వ్యవస్థలోనా? పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు చెప్పడం 'ఆడలేక మద్దెలు ఓడు' అన్నట్లు ఉంది. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇకనైనా ఇటువంటి మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిది అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it