Telugu Gateway
Politics

అరాచ‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఏపీ

అరాచ‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఏపీ
X

ఏపీలో టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల ఘ‌ట‌న‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖండించారు. ఈ దాడుల‌పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు తీసుకోవాల‌న్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లా తయారవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల‌న్నారు. దాడికి పాల్పడిన వారు వైసీపీ వర్గీయులని చెబుతున్నారు. అదే నిజం అయితే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని కోరుతున్నాం. అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సత్వరం దీని మీద దృష్టి సారించాలి. విమర్శలు, ప్రతివిమర్శలు చేసేటప్పుడు నియంత్రణ పాటించాలి.

విమర్శ హర్షించే విధంగా ఉండాలి తప్ప... ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉండకూడద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయ‌న్నారు. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ లో ఉండగా మంగళగిరి, గుంటూరుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగిన విషయం త‌న‌ దృష్టికి వచ్చింద‌న్నారు. విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లో వారి నాయకుల మీద కూడా దాడులు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం. ఈ విధంగా వ్యక్తిగత దాడులు గానీ, పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖలు దీని మీద దృష్టి సారించాల‌న్నారు.

Next Story
Share it