Telugu Gateway
Politics

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప‌వ‌న్ సంఘీభావ దీక్ష

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప‌వ‌న్ సంఘీభావ దీక్ష
X

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వేగంగా పావులు క‌దుపుతుంటే బిజెపికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం కేంద్ర నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా..ఉద్యోగుల పోరాటానికి మ‌ద్దతుగా సంఘీభావ దీక్ష చేయాలని నిర్ణ‌యించారు. ఈ నెల‌12న ఆయ‌న దీక్షకు కూర్చోనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకొనేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి అండగా నిల‌వాల‌ని నిర్ణ‌యించార‌ని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఆందోళనను విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదని జ‌న‌సేన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష చేప‌డ‌తార‌ని, ఉదయం 10 గంట‌ల‌కు దీక్ష ప్రారంభించి సాయంత్రం 5గంట‌ల‌కు ముగిస్తారు. పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ దీక్షలో కూర్చొంటారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని గ‌తంలో పవన్ కళ్యాణ్ కేంద్రంలోని నేత‌ల‌కు లేఖ‌లు అంద‌జేశారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని, తెలుగువారికి ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని ఢిల్లీలో వివరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. 300 రోజులకుపైబడి విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాటం సాగిస్తున్న వారికి అండగా నిలిచేలా పవన్ కళ్యాణ్ ఈ నెల 12న ఈ దీక్షను త‌ల‌పెట్టారు.

Next Story
Share it