Telugu Gateway
Politics

వైసీపీ ఏపీ ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా భావిస్తోంది

వైసీపీ ఏపీ ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా భావిస్తోంది
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌దే అదికారం

ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌జ‌ల‌ను త‌మ బానిస‌లుగా భావిస్తోంద‌ని..తాము చేసినా భ‌రించాల్సిందే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌దే అధికారం అని వ్యాఖ్యానించారు. తాను న‌డిచి చూపిస్తాన‌ని ..మీరు నా వెంట న‌డ‌వండి అంటూ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. సోమ‌వారం నాడు ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చని.. వ్యక్తిగత ద్వేషాలొద్దన్నారు. వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆయన వ్యాఖ్యానించారు. అంత‌కు ముందు ఆయ‌న అన్ని పార్టీ నేత‌ల‌కూ న‌మ‌స్కారం అంటూ ప్ర‌సంగించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు.

నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలని, ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని పవన్ తెలిపారు. ''వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు. వైసీపీ కార్యకర్తల్ని ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్ నిండాముంచేశాడ‌ని విమ‌ర్శించారు. 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీయే. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు?. మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేనే. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతే. '' అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా పొత్తుల‌పై మాట్లాడ‌క‌పోయినా స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ ప్ర‌క‌టించారు. తాను బీజేపీ రోడ్ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాలు పక్కనపెట్టి.. పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

Next Story
Share it