తెలంగాణ బిజెపిపై పవన్ కళ్యాణ్ ఫైర్
చులకన చేసేలా మాట్లాడితే సహించం
ప్రతిసారి వాడుకుని వదిలేస్తున్నారు
జనసేనకూ ఏపీ, తెలంగాణలోనూ బలం ఉంది.
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి కార్యకర్తల మద్దతు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా అడిగారని బిజెపికి మద్దతు ఇచ్చామన్నారు. దీనికి తెలంగాన జనసేన నాయకులు, జనసైనికులు ఎంతో సహకరించారన్నారు. జనసేన సహకారన్ని ప్రధాని నరేంద్రమోడీతోపాటు..ప్రత్యేక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా గుర్తించి కృతజ్ణతలు తెలిపారన్నారు. జనసేన బలాన్ని కేంద్ర నాయకత్వం అర్ధం చేసుకుంది కానీ..తెలంగాణ బిజెపి నేతలు మాత్రం చులకన చేసి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన జనసేన వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర స్థాయి నాయకుల తీరు అందరికీ మనస్థాపం కలిగించిందని అన్నారు. తెలంగాణ జనసేన నేతలు, క్యాడర్ వాడుకుని వదిలేశారని భావనలో ఉన్నారన్నారు.
ఎన్నికలప్పుడు ఐదు ఓట్లు ఉంటే అడుగుతారని..అలాంటి లక్షల సంఖ్యలో ఓట్లు ఉన్న జనసేనను విస్మరించారని..అందుకే జనసేన శ్రేణులు అభిమతం ప్రకారం దేశానికి ఎంతో సేవలు అందించిన మాజీ ప్రధాని పీ వీ కుమార్తే వాణిదేవికి మద్దతు తెలపాలన్న క్యాడర్ నిర్ణయాన్ని ఆమోదించినట్లు తెలిపారు. పార్టీకి మద్దతుగా కాకుండా..పీవీ కుమార్తె గా ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల నిర్ణయాన్ని గౌరవించానని..గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా ఎవరినీ బలవంతంగా అటు నెట్టను అంటూ తెలంగాణ బిజెపి నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్, బిజెపి మద్దతు తెలిపాయి. ఆంధ్రాకు న్యాయం చేసి విభజన జరగాలన్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఏపీ కొట్టుమిట్టాడుతోంది. ఆంధ్రా ప్రజలకు బలమైన భరోసా ఇచ్చేలా నరేంద్రమోడీ మాట్లాడారు. అందుకే బిజెపికి సంపూర్ణంగా మద్దతుగా ప్రకటించాం. అదే సమయంలో అధికార వైసీపీపై కూడా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రజల కడుపుకొట్టి గెలిచింది తప్ప..గుండెలనిండా ధైర్యం నింపి కాదన్నారు. రేషన్ కార్డులు తీసేస్తాం..అన్ని పథకాలు ఆపేస్తాం అని బెదిరించారని ఆరోపించారు. 'వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మాటలు కొంత మంది నా దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించమనండని అని సజ్జల అన్నారు. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ ఇప్పించాలా? 22 మంది ఎంపీలు..151 ఎమ్మెల్యేలు ఉన్నారుగా మీకు. ఓడిపోయినవాడికి వదలొచ్చు కదా..వదలటం లేదు..మనకు బలం ఉంది.. మార్పు తీసుకురాగలం. తెలాంణలోనూ ఉంది. ఆంధ్రాలోనూ మనకు బలం ఉంది. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడుతుంది. ' అని వ్యాఖ్యనించారు.