పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి
ఏపీలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం విషయంలో గొడవలు చేసిన వైసీపీ నేతలు రాముడి విగ్రహం విషయంలో మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ లు చేస్తారు..కానీ న్యాయమూర్తులపై వైసీపీ వాళ్ళు మాత్రం న్యాయమూర్తులపై ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు ఉండవన్నారు. పవన్ కళ్యాణ్ శనివారం నాడు ఒంగోలు లో మీడియాతోమాట్లాడారు. ఏపీలో కూడా సీఎం జగన్ వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ నేతలు బైబిల్ పట్టుకుని ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు. పంచాయితీ ఎన్నికలు వద్దు అనడానికి వైసీపీ నాయకులు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవన్నారు. మీడియా సమావేశంలో పాటించే సోషల్ డిస్టెన్స్ కంటే ఓటు వేయడానికి వెళ్లినప్పుడు పాటించే డిస్టెన్స్ ఎక్కువ. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నాయకులు వేడుకలు చేసుకున్నారు. దాని వల్లే కదా శ్రీ కాళహస్తిని రెడ్ జోన్ గా ప్రకటించారు.
పంచాయితీ ఎన్నికలు కచ్చితంగా జరగాలి. ఎంతకాలం కోర్టుల చుట్టు తిరుగుతూ అడ్డుకుంటారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికే ఎక్కువ లబ్ధి ఉంటుంది అంటారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. నిమ్మగడ్డ రమేష్ ని వ్యక్తిగతంగా కులం పేరుతో దూషించడం ఏం సంస్కృతి. అలా దూషించబట్టే మీకు మతాలను అంటగట్టారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఎన్నికల విషయంలో ఆలోచించాలి. రాజకీయ ప్రక్రియలో ఎన్నికలు భాగం. ఫ్రంట్ లైన్ వారియర్స్ తోపాటు ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలి" అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ, ముఖ్యమంత్రి మీద పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. బలహీనులపై బలమైన చట్టాలు ప్రయోగించి.. అడ్డు అదుపు లేకుండా మాట్లాడే నాయకుల మీద చర్యలు తీసుకోరేంటి.? దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎస్పీ ని కలిసి కోరాం. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అడిగాం. ఆయన కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.