Telugu Gateway
Politics

జ‌గ‌న్ ను సీబీఐ ద‌త్త‌పుత్రుడు అంటా

జ‌గ‌న్ ను సీబీఐ ద‌త్త‌పుత్రుడు అంటా
X

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ మండిప‌డ్దారు. త‌న‌ను మ‌రోసారి చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడు అంటే జ‌గ‌న్ ను సీబీఐ ద‌త్త‌పుత్రుడు అని పిల‌వాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. జనసేనను టీడీపీ బి టీం అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటాం అని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ దేశం కోసం కాదు ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లారు అని వ్యాఖ్యానించారు. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన మీరా నీతులు చెప్పేది అని ప్ర‌శ్నించారు. తాను చ‌నిపోయిన కౌలురైతుల పరామర్శకు వస్తున్నాను అని తెలియగానే బాధిత రైతులకు పరిహారం ఇస్తున్నార‌న్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌వారం నాడు అనంత‌పురం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని తెలిపారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని అన్నారు. వైసీపీ హయాంలో దాదాపు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. "కౌలు రైతుకు అండగా ఉండాలి, వారి కుటుంబాల్లో భరోసా నింపాలనే ఈ యాత్ర ప్రారంభించాం.

ఉదయం నుంచి నాలుగు కుటుంబాలను పరామర్శించి, రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాం. రైతు కుటుంబాలను జనసేన పార్టీ తరఫున పరామర్శిస్తున్నామని తెలిసీ ప్రభుత్వం హుటాహుటిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తోంది. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వ్యక్తులకు కూడా ఇవాళ వారి కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పని రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు చేస్తే చాలా బాగుండేది. ఇతర పార్టీలకు పొలిటికల్ మైలేజ్ రాకూడదని చేసినా... ఇప్పటికైనా కళ్లు తెరచి నష్టపరిహారం అందించారు. చాలా మంది వైసీపీ నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా వాళ్లతో మాట్లాడతాను. నేను వాళ్ల పార్టీ పాలసీలపై మాట్లాడుతుంటే... వాళ్లు మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ అగ్ర నాయకత్వానికీ, నన్ను తిట్టే వ్యక్తులకు ఒకటే చెబుతున్నాను... నేను ఏమీ విదేశాల్లో చదువుకోలేదు, లండన్ రాయల్ ఫ్యామిలీ కాదు. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష నాకు వచ్చు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం ఇష్టం లేక మాట్లాడటం లేదంతే. జనసేన లేని సమస్యను సృష్టించదు. ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. దానిపై స్పందించాలని కోరుకుంటున్నాం. కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమం ప్రారంభించకపోతే ప్రభుత్వంలో చలనం రాదు. ప్రతి కౌలు రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తాం. వాళ్ల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా లెక్కన సంక్షేమ నిధి ఏర్పాటు చేసేలా ఆలోచన చేస్తున్నాం. ఈ సంక్షేమ నిధికి నా వంతు సాయం నేను అందిస్తానని" చెప్పారు.

Next Story
Share it