ఎన్డీయేకు మరో షాక్
రైతు బిల్లుల వ్యవహారం రాజకీయంగా బిజెపికి చిక్కులు తెచ్చిపెడుతోంది. విపక్షాలపై విమర్శలు చేస్తూ..బిల్లుల వల్ల రైతులకు లాభం తప్ప ..నష్టం జరగదని చెబుతోంది. విశేషం ఏమిటంటే ఎన్డీయే లో భాగస్వామ్య పక్షాలే ఈ విషయాన్ని నమ్మటం లేదు. రైతు బిల్లుల కారణంగానే రెండు పార్టీలు ఎన్డీయేకు గుడ్ బై చెప్పాయి. తొలుత పంజాబ్ కు చెందిన అకాళీదల్ ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు.ఏకంగా కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా ఆ పార్టీ తప్పుకుంది. ఇప్పుడు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్ పీ) వంతు వచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, దానికి నిరసనగా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు రాజస్థాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌పీ అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ ప్రకటించారు. తక్షణమే రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతుమన్నామని శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. రైతుల డిమాండ్లపై వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారు.
రాజస్తాన్‌లో బలమైన సామాజికవర్గం మద్దతుదారులను కలిగి ఉన్న ఆర్‌ఎల్‌పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్లపై చర్చించాలంటూ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ సైతం రాశారు. లేఖపై ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.