Telugu Gateway
Politics

హుజూరాబాద్ నుంచి మ‌రో ఉద్య‌మం

హుజూరాబాద్ నుంచి మ‌రో  ఉద్య‌మం
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మంగ‌ళ‌వారం నాడు త‌న నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ కు రాజీనామా చేసిన ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా గుడ్ బై చెప్ప‌నున్న విష‌యం తెలిసిందే. ఈటెల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోందని వ్యాఖ్యానించారు. అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్‌ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, 19ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసం పని చేశానని చెప్పారు.

త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మానికి, అధర్మానికి యుద్ధం జరుగుతుందని, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరగబోతుందని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్ లో ప‌ర్య‌టించారు.

Next Story
Share it