Telugu Gateway
Politics

టీఆర్ఎస్ పిచ్చోళ్ళ పార్టీ మద్దతు తీసుకుంటుందా?!

టీఆర్ఎస్ పిచ్చోళ్ళ పార్టీ మద్దతు తీసుకుంటుందా?!
X

ఓ వైపు ముఖ్యమంత్రి కెసీఆర్ దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావు శతదినోత్సవ సందర్భంగా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఎన్నడూ లేని రీతిలో పీ వీ పేరు జపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎంఐఎం శాసననసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పేదల అక్రమ కట్టడాలను కూల్చే టీఆర్ఎస్ సర్కారు కు దమ్ముంటే పీ వీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చాలంటూ సవాల్ విసిరారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ఎన్నికల ప్రచారంలో పలుమార్లు స్పందించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అక్భరుద్దీన్ లను వాడొక పిచ్చోడు..వీడొక పిచ్చోడు అంటూ ఎద్దేవా చేశారు. మరి ఇఫ్పుడు జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కాలంటే ఎంఐఎం మద్దతు అనివార్యం అవుతోంది. ఎన్ని ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నా మేయర్ పీఠానికి కావాల్సిన దాని కంటే తక్కువే ఉన్నాయి. సో..ఎంఐఎం మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అసలు తమకు ఎంఐఎంతో సంబంధమే లేదని చెప్పిన టీఆర్ఎస్ పీవీ నరసిహరావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న ఎంఐఎం మద్దతు తీసుకోవటం అనివార్యం కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొత్త కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. మేయర్ ఎన్నిక రోజు ఎంఐఎం ఓటింగ్ కు దూరం ఉంటుంది..డిప్యూటీ మేయర్ ఉఫ ఎన్నిక విషయంలోనూ అలాగే చేస్తారని వార్తలు వెలువడ్డాయి.

అంటే హైదరాబాద్ ప్రజలు ఈ జిమ్మిక్కులను ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా?. ఒకరికి ఒకరు పరోక్షంగా సహకరించుకున్నా..లేదు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అని నేరుగా పొత్తు పెట్టుకున్నా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా రోజురోజుకు బలపడుతున్న బిజెపికి కావాల్సింది కూడా ఇదే. సీఎం కెసీఆర్ పై తాజాగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీని ద్వారా భవిష్యత్ రాజకీయాలపై ఆయన స్పష్టమైన సంకతాలు అయితే ఇచ్చారు. గతంలో సీఎం కెసీఆర్ కూడా తాను, అసదుద్దీన్ లు కలసి ప్రత్యేక విమానంలో దేశమంతటా తిరిగి దేశాన్ని ఏకం చేస్తామని ప్రకటించారు. కానీ ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ డైనమిక్స్ మార్చబోతున్నాయనే విషయం మాత్రం స్పష్టంగా కన్పిస్తోంది.

Next Story
Share it