Telugu Gateway
Politics

అగ్నిపథ్‌పై ముందుకే!

అగ్నిపథ్‌పై ముందుకే!
X

మంత్రులు..ఆర్మీ ఉన్న‌తాధికారుల ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటే అగ్నిపథ్‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గే యోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌న్పించ‌టంలేదు. ఆదివారం నాడు కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాధికారుల‌తో స‌మావేశం కావటంతో కీలక‌ ప్ర‌క‌ట‌న వ‌స్తుందని భావించారు. అయితే ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత ఆర్మీ అధికారుల ప్ర‌క‌ట‌న మాత్రం అందు భిన్నంగా ఉంది. అగ్నిప‌థ్ ప్రవేశ‌పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలు..అంత‌కు ముందు తీసుకున్న చ‌ర్య‌ల వంటి విష‌యాలు వెల్ల‌డించారు. భార‌త సైన్యంలో స‌గ‌టు వ‌య‌స్సు త‌గ్గించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు తెల‌ప‌టం విశేషం. దేశ వ్యాప్తంగా అగ్నిప‌థ్ పై తీవ్ర స్థాయిలో ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నా కూడా కేంద్రం మాత్రం వెన‌క్కి త‌గ్గే సూచ‌న‌లు క‌న్పించ‌టం లేద‌నే సంకేతాలు వెల్ల‌డ‌య్యాయి. తాజాగా త్రివిధ దళాల అధిపతులు అగ్నిపథ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఏ అడిషన్‌ సెక్రటరీ అనిల్‌పురి మాట్లాడుతూ.. ''అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేశాం. అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్‌ పెండింగ్‌లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చాము. సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్‌లు సైన‍్యంలో కొనసాగే వీలుంది.

'అగ్నివీర్స్' దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది. ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్‌ల నియామకం చేపడుతున్నాము. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్​మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్‌లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర‍్ణయం తీసుకున్నాము. ఈ నెల ఎయిర్‌ఫోర్స్‌లో 24 నుంచి తొలి బ్యాచ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ టెస్టు ఉంటుంది. డిసెంబర్‌ 30 నాటికి తొలిబ్యాచ్‌ ట్రైనింగ్‌కు వెళ్తారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవు. అగ్నిపథ్‌ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయి. సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు '' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు చూస్తుంటే ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే అగ్నిప‌థ్ తోనే సాగ‌నున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది.

Next Story
Share it