Telugu Gateway
Politics

బీజేపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
X

మూడవ సారి కూడా కేంద్రంలో అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వస్తామని బీజేపీ చెపుతూ వస్తోంది. తమకే సొంతంగా 370 సీట్ల వరకు వస్తాయని...కూటమి తో కలుపుకుంటే ఈ సంఖ్య 400 కు చేరుతుంది అని ప్రధాని మోడీ దగ్గర నుంచి మొదలు పెట్టి ఆ పార్టీ కీలక నేతలు అందరూ ఇదే నినాదం అందుకున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ అభ్యర్థి ఒకరు ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదు అని...గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలా పోరాటం చేస్తామో అలాగే చేయాల్సి ఉంటుంది అన్నారు. ఓటర్లు అందరిని పన్నెండు గంటల లోపు పోలింగ్ బూత్ కు తీసుకువచ్చి ఓటు వేయమని చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావటంతో ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్లు అయింది. మోడీ వేవ్ లేదు అంటూ మాట్లాడింది బీజేపీ అమరావతి అభ్యర్థి నవనీత్ రాణా. గత ఎన్నికల్లో మోడీ వేవ్ ఉన్నా తాను ఇండిపెండెంట్ గా గెలిచాను అంటూ ఆమె చెప్పటం విశేషం. సోమవారం నాడు ఆమె తన నియోజకవర్గంలో నేతలతో సమావేశం అయి మాట్లాడారు. దీనికి సంబదించిన వీడియో బయటకు రావటంతో ఒక్క సారిగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి అనే చెప్పొచ్చు.

నవనీత్ రాణా చెప్పింది నిజమే అని..ఆమె వాస్తవం చెప్పారు అంటూ ఎన్ సి పీ శరద్ పవార్ వర్గం ప్రధాన అధికార ప్రతినిధి మహేష్ తపస్ వ్యాఖ్యానించారు. ఇదే విషయం బీజేపీ ఎంపీ అభ్యర్థులు అందరికి తెలుసు అన్నారు. శివ సేన కు చెందిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ మోడీ వేవ్ సంగతి పక్కన పెట్టి అయన తన సొంత నియోజక వర్గంలో గెలుస్తారో లేదో అని సందేహం వ్యక్తం చేశారు. ఈ వీడియో దుమారం రేపటంతో నవనీత్ రాణా మీడియా తన మాటలను వక్రీకరించింది అంటూ స్పందించారు. ఇప్పుడే కాదు..ఎప్పుడూ మోడీ వేవ్ ఉంటుంది అని...తాము చేసిన మంచి పనులతోనే 400 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా దేశంలో బీజేపీ కి వచ్చే సీట్ల విషయంలో రక రకాల చర్చలు సాగుతున్నాయి. బీజేపీ సొంతంగా 200 సీట్ల వరకు మాత్రమే చేరుకునే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ కి వచ్చే సీట్ల పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం వరకు తాను బీజేపీ కి 180 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అని భావించాను అని..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు అన్నారు. బీజేపీ సీట్లు 150 కే పరిమితం అయ్యే అవకాశం ఉంది అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా తాను ఈ మాట చెపుతున్నట్లు వెల్లడించారు.

Next Story
Share it