బిజెపికి రెండు డిప్యూటీ సీఎం పోస్టులు
బీహార్ లో నితిష్ కుమార్ చెందిన జెడీయూ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న బిజెపికి ఈ సారి అదనంగా ఓ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతంలో ఒక్క ఉప ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు బిజెపికి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా తదితరులు హాజరు అయ్యారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యంత ఉత్కం ఠగా సాగిన బీహార్ అసెంబ్లీ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్‌డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కాయి.
మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్‌కిషోర్ ప్రసాద్, రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు నితీష్ కుమార్‌ను నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.