Telugu Gateway
Politics

నియంతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు

నియంతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు
X

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాయటంపై సజ్జల స్పందించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన అసలు ఐఏఎస్ ఎలా అయ్యారో అర్ధం కావటంలేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదనే అంశం ఎక్కవ నుంచి వచ్చిందో అర్ధం కావటంలేదన్నారు. తాను ఈ పదవిలోకి రాకముందు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని తెలిపారు. లేని అధికారాలు కూడా చెలాయించాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 'నిమ్మగడ్డ రమేష్‌‌కుమార్ అన్ని హద్దులు దాటారు. సంస్కార హీనుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ అన్నీ వదిలేశారు. మేం ఎక్కడా గీత దాటడం లేదు.

ఎన్నికలు సజావుగా జరపడం ఎస్‌ఈసీ బాధ్యత. ఏ ఎన్నికలయినా నియమ నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఎస్‌ఈసీ స్థానంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. కానీ నిమ్మగడ్డ నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి ఆక్షేపణీయం. చంద్రబాబు ఏజెంట్‌గా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నమ్మకపోతే ఎలా? టీడీపీ గూండాలను పెట్టుకుని ఎన్నికలు జరుపుతారా? ఇది మీ వ్యక్తిగత రాజ్యాంగమా?' అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.పార్టీ రహిత ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని..దీనిపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.

Next Story
Share it