ముంబయ్ లో రాత్రి కర్ఫ్యూ
మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముంబయ్ తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. ఈ మంగళవారం అంటే డిసెంబర్ 22 నుంచి జనవరి 5వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని సర్కారు వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.
వారికి ఐదు లేదా ఏడవరోజు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ అని తేలితేనే రాష్ట్రంలోకి అనుమతించనుంది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే ఆంక్షలు విధించింది. కోవిడ్ వ్యాప్తి నివారణకు సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలందరూ కోవిడ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.