పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ పదవికి సిద్దూ రాజీనామా
సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఓ పక్క అసమ్మతి కారణంగా ఏకంగా సిద్ధూ కోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నే పక్కకు తప్పించింది అధిష్టానం. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇది పంజాబ్ కాంగ్రెస్ కు పెద్ద కుదుపుగా మారింది. పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన 72 రోజులకే సిద్ధూ ఈ నిర్ణయం తీసుకోవటం కలకలం రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఈ అంతర్గత గొడవలతో అంతా గందరగోళం నెలకొంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తూ సోనియాకు పంపిన లేఖలో తాను పార్టీలోనే కొనసాగుతానని పేర్కొనటం విశేషం. పంజాబ్ భవిష్యత్, రాష్ట్ర వెల్ఫేర్ విషయంలో ఎప్పుడూ రాజీపడనన్నారు. అమరీందర్ సింగ్ ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.