Telugu Gateway
Politics

విగ్ర‌హంపై ఆగ్ర‌హం

విగ్ర‌హంపై ఆగ్ర‌హం
X

విగ్ర‌హానికి ఉగ్ర‌రూప‌మెందుకు?. ఇది ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌శ్న‌. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వనంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇటీవ‌లే జాతీయ చిహ్నాం ఆవిష్క‌రించారు. ఇది కూడా పెద్ద దుమార‌మే రేపింది. అస‌లు పార్ల‌మెంట్ భ‌వ‌నంపై లోక్ స‌భ స్పీక‌ర్, రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ లను ప‌క్క‌న పెట్టుకుని ప్ర‌ధాని మోడీ జాతీయ చిహ్న‌న్ని ఆవిష్క‌రించ‌టాన్ని కూడా కొంత మంది త‌ప్పుప‌ట్టారు. దీనిపై బిజెపి వివ‌ర‌ణ కూడా విచిత్రంగానే ఉంది. ఇంకా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం కాలేదు కాబ‌ట్టి ప్ర‌ధాని ప్రారంభించార‌ని..త‌ర్వాత దాన్ని పార్ల‌మెంట్ సెక్ర‌టేరియ‌ట్ కు అప్ప‌గిస్తార‌ని చెప్పుకొచ్చారు. అన్నింటి కంటే ముఖ్యంగా పార్ల‌మెంట్ భ‌వ‌నంపై జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ‌ను ప్ర‌ధాని మోడీ అదేదో ప్రైవేట్ వ్య‌వ‌హారంలాగా...ఏ ఇత‌ర పార్టీల‌ను ఆహ్వానించ‌కుండా చేయ‌టంపై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తాయి. నిజానికి పార్ల‌మెంట్ అనేది అన్ని పార్టీల భాగ‌స్వామ్యంతోనే న‌డుస్తుంద‌నే విషయం తెలిసిందే. ఆ సంగ‌తి ప‌క్క‌న పెట్టి ప్ర‌ధాని మోడీ మాత్రం త‌న ప‌ని తాను చేసేశారు. ఇప్పుడు జాతీయ చిహ్నం విగ్ర‌హం రూపంపై పెద్ద దుమార‌మే రేపుతోంది. సార‌నాధ్ లోని అశోక స్థూపంపై సింహాలు శాంతంగా ఉంటే..తాజాగా ప్ర‌ధాని ఆవిష్క‌రించిన జాతీయ చిహ్నాంలో సింహాలు మాత్రం ఆగ్ర‌హంగా..ఉగ్ర‌రూపంతో ఉన్న‌ట్లు క‌న్పిస్తున్నాయ‌ని ప‌లు పార్టీల నేతలు మండిప‌డ్డారు.

సోష‌ల్ మీడియాలోనూ దీనిపై పెద్ద దుమార‌మే రేగుతోంది. ఖ‌చ్చితంగా పార్ల‌మెంట్ లో కొత్త‌గా ఆవిష్క‌రించిన ఈ విగ్ర‌హంలో మార్పులు చేయాల్సిందేన‌నే డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ వాద‌న‌ల‌ను బిజెపి స‌హ‌జంగానే తోసిపుచ్చుతూ అంతా బాగానే ఉంద‌ని..ప్ర‌ధాని మోడీపై అక్క‌సుతోనే ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిదీ రాజ‌జ‌కీయం చేస్తున్నాయ‌ని కౌంట‌ర్ ఇచ్చింది. అశోక స్తంభంలోని సింహాల‌ను మార్చ‌టం అంటే అది జాతీయ చిహ్నాన్ని అవ‌మానించ‌ట‌మే ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరాం రమేష్ త‌ప్పుప‌ట్టారు. నూత‌న పార్ల‌మెంట్ పై కొత్త విగ్ర‌హాన్ని చూస్తే స‌త్య‌మేవ జ‌య‌తే నుంచి సింహ‌మేవ జ‌య‌తేగా మారిన‌ట్లు క‌న్పిస్తోంద‌ని టీఎంసీ ఎంపీ మ‌హువా మెయిత్రా ఎద్దేవా చేశారు. ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా గాంధీ నుంచి గాడ్సే వ‌ర‌కూ వ్యాఖ్యానించారు. మ‌రి ఈ విగ్ర‌హా వివాదం ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it