జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
మరి ట్రైలర్..అసలు సినిమా ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. సహజంగా సినిమాలకే టీజర్లు..ట్రైలర్లు ఉంటాయి. కానీ రాజకీయాల్లోనూ నారా లోకేష్ ఇప్పుడు ఓ కొత్త ఒరవడి తెచ్చినట్లు కన్పిస్తోంది. అధికార పార్టీపై..అందులోనూ ఏకంగా ముఖ్యమంత్రిపై ఏదైనా సంచలన విషయం ఆకస్మాత్తుగా బహిర్గతం చేస్తే అది పెద్ద సంచలనం అవుతుంది. అయితే అది అందులో ఉండే విషయాన్ని బట్టి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మహానాడు సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మహానాడు తర్వాత సీఎం జగన్ కు సంబంధించిన రెండు పెద్ద కుంభకోణాలను బహిర్గతం చేస్తానని ప్రకటించారు. ఈ కుంభకోణాలకు సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. నారా లోకేష్ మరి ఎలాంటి సంచలన విషయాలను బహిర్గతం చేస్తారో వేచిచూడాల్సిందే. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని స్పష్టం చేశారు.
జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికొదిలేశారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలను, ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడర్‌ను కూడా హింసిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. పాదయాత్రతోపాటు ఎలాంటి కార్యక్రమాల చేపట్టానికి అయినా సిద్ధమని లోకేష్ ప్రకటించారు. ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన వారికి టిక్కెట్ ఇవ్వకూడదనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోందని తెలిపారు. అదే సమయంలో పార్టీ పదవుల్లో కొంత మంది నేతలే సుదీర్ఘ కాలం ఉండటం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే తాను కూడా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులను ఇన్ ఛార్జిలుగా నియమించాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో వారసులతోపాటు కొత్త వారికి కూడా కలుపుకుని 40 శాతం సీట్లు యువతకు ఇవ్వనున్నట్లు మరోసారి తెలిపారు.