Telugu Gateway
Politics

వివేకా హత్య ఆధారాలు మాయం చేసింది వారే

వివేకా హత్య ఆధారాలు మాయం చేసింది వారే
X

నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి, ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని ఆరోపించారు. వీళ్లే హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా మాయం చేశారని అన్నారు. ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియాకు చెప్పారని..హత్యను ఇలా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చారని అన్నారు. సొంత బాబాయ్ ను ఎవరు హత్య చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ కు లేదా అన్నారు. వివేకా హత్య అనంతరం తన తండ్రి ఫోటో వేసి తమ కుటుంబానికి రక్తచరిత్ర ఉన్నట్లు సాక్షి పత్రికలో రాశారని..తమకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని..అందుకే దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధపడ్డామన్నారు నారా లోకేష్. రక్తచరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి ఇలా వరసగా చనిపోతున్నారని తెలిపారు. మరి ఎప్పుడు ఈ కేసులో నిజాలు బయటకు తెస్తారని అన్నారు. నిజంగా జగన్ కు ఈ హత్యతో సంబంధం లేకపోతే వెంకటేశ్వరస్వామి దగ్గర ప్రమాణం చేయటానికి రావాలన్నారు.

గతంలో ప్రకటించిన విధంగా నారా లోకేష్ బుధవారం నాడు తిరుపతిలోని అలిపిరి వద్దకు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి తిరుపతి చేరుకోవటానికి హెలికాప్టర్ లో 45 నిమిషాలే పడుతుందని..చిత్తశుధ్ధి ఉంటే జగన్ తన ఛాలెంజ్ ను స్వీకరించి ప్రమాణం చేయటానికి ముందుకు రావాలన్నారు. తమ కుటుంబానికి చిత్తశుధ్ధి ఉందని..అందుకే చెప్పిన మాట ప్రకారం అలిపిరి వచ్చానన్నారు. జగన్ అయినా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా రావొచ్చని..వారి కోసం గంట పాటు ఇక్కడ వేచిచూస్తానన్నారు. వివేకా కూతురు కూడా ఈ హత్య వెనక ఎవరు ఉన్నారో స్పష్టంగా చెప్పిందని అన్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు అలిపిరి వద్ద నినాదాలు చేశాయి.

Next Story
Share it