'నా డ్యూటీ నన్ను చేయనివ్వండి'
తెలుగుదేశం ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. నరసరావుపేట పర్యటన కోసం గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో వాదనకు దిగారు. ఎమ్మెల్సీగా తన బాధ్యత నిర్వర్తించేందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రమే వెళుతున్నానని..కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడతానన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని..రాష్ట్రంలో ఎక్కడా లేని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఒక్క గుంటూరులోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అదే పరిస్థితి ఉంటే అది పోలీసుల వైఫల్యమే అన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తాను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నానని, ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తానని చెప్పినా పోలీసులు వినకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కావాలనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏది తప్పో.. ఏది ఒప్పో తనకు తెలుసున్నారు.