Telugu Gateway
Politics

మునుగోడు ఫైట‌ర్లు ఫిక్స్

మునుగోడు ఫైట‌ర్లు ఫిక్స్
X

అధికార టీఆర్ఎస్ ముందు నుంచి జ‌రుగుతున్న ప్ర‌చారాన్నే నిజం చేసింది. ఉప ఎన్నిక బ‌రిలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డినే బ‌రిలో దింపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆయ‌న‌కు పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్ర‌వారం నాడు బీ ఫాం అంద‌జేశారు. బీ ఫాంతో పాటు పార్టీ నిధి నుంచి ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం 40 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కు కూడా ఇచ్చారు. దీంతో ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధులు అంతా ఖ‌రారు అయిన‌ట్లు అయింది. అంద‌రి కంటే ఆల‌శ్యంగా..చివ‌ర్లో అభ్య‌ర్ధిని ఖ‌రారు చేసింది టీఆర్ఎస్ పార్టీనే కావ‌టం విశేషం. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మంది నేత‌లు కూసుకుంట్ల‌కు టిక్కెట్ ఇవ్వ‌ద్ద‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప‌లు మార్లు స‌మావేశాలు కూడా పెట్టారు. మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య‌గౌడ్ ఈ సారి నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక శాతం ఉన్న బీసీల‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరారు. మ‌రి కొంత మంది నేత‌లు కూడా ఇదే డిమాండ్ ను తెర‌పైకి తెచ్చారు.అయినా అధిష్టానం మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గుచూపింది. టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఖ‌రారుతో అన్ని ప్ర‌ధాన పార్టీల నుంచి ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్ధులే బ‌రిలో ఉన్న‌ట్లు అయింది.

టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న‌తో గ‌తంలో అస‌మ్మ‌తి స్వ‌రాలు విన్పించిన వారు తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తారా..లేక చ‌ల్లబ‌డిపోతారా అన్న‌ది వేచిచూడాల్సిందే. ఈ ఎన్నిక‌ను అధికార టీఆర్ఎస్ తోపాటు బిజెపి,కాంగ్రెస్ లు కూడా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఎందుకంటే స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు వ‌చ్చిన ఉప ఎన్నిక కావ‌టంతో దీని రాజ‌కీయ ప్ర‌భావం చాలానే ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అందుకే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్న బిజెపి ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆ పార్టీ వ‌ల్లే ఉప ఎన్నిక వ‌చ్చింది. మ‌రి ఉప ఎన్నిక తెచ్చిన పార్టీ అందులో విజ‌యం సాధించలేక‌పోతే ఆ ప్ర‌భావం గ‌ట్టిగానే ఉంటుంది. మ‌రో కీల‌క పార్టీ కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే ఈ సీటు కాంగ్రెస్ పార్టీదే. మ‌రి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మారినా త‌న సీటును నిల‌బెట్టుకోగలుగుతుందా అన్న‌ది వేచిచూడాల్సిందే. గ‌తానికి భిన్నంగా ఈ సారి కాంగ్రెస్ కాస్త ముందుగానే పాల్వాయి స్ర‌వంతిని అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్ధి కూడా ఖరారు అయిపోయారు. దీంతో మునుగోడు ఫైట‌ర్స్ ఫిక్స్ అయిపోయారు...ఇక ఎన్నిక జ‌ర‌గ‌టం..ప‌లితం రావ‌టమే మిగిలింది.

Next Story
Share it