Telugu Gateway
Politics

మునుగోడు బ‌లం బిజెపిదా..రాజ‌గోపాల్ రెడ్డిదా?!

మునుగోడు బ‌లం బిజెపిదా..రాజ‌గోపాల్ రెడ్డిదా?!
X

అస‌లు ఇప్ప‌టికిప్పుడు మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి బ‌లం ఎంత‌?. మునుగోడులో బ‌లం బిజెపిదా లేక ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌గోపాల్ రెడ్డిదా. ఈ ప్ర‌శ్న‌కు ఖ‌చ్చితంగా కాంగ్రెస్ ప్ల‌స్ రాజ‌గోపాల్ రెడ్డి అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర‌మంత‌టా సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఉంది. ఎంత త‌గ్గినా ఇంకా దాని ప‌ట్టు పోలేదు. మ‌రి ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బిజెపిలో చేరితే కాంగ్రెస్ లో గెలిచినంత ఈజీగా మ‌ళ్లీ గెల‌వ‌గల‌రా?. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి ప‌ట్టు ఉంది. ప్ర‌చారం జ‌రుగుతున్నట్లు రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే..అక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌స్తే. బిజెపి అనుకుంటున్న‌ట్లు గెలుపు సాధ్యం అవుతుందా?. అంటే అది ఏమంత తేలికైనా వ్య‌వ‌హారం కాద‌ని న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న నేత‌లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెబుతున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే బిజెపి రాజ‌గోపాల్ రెడ్డి రాజ‌కీయ జీవితాన్ని పెద్ద రిస్క్ లో పెడుతున్న‌ట్లే అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

ఎందుకంటే ఇప్ప‌టికిప్పుడు బిజెపికి అంటూ అక్క‌డ పెద్ద‌గా బ‌లం లేదు. రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలోచేరితే అక్క‌డ స‌హ‌జంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మార‌టం ఖాయం. అధికార టీఆర్ఎస్ ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే లెక్క‌ల‌తో ఇప్ప‌టికే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదికిపైగా స‌మ‌యం ఉన్న ఈ త‌రుణంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోదు. ఈ ప‌రిస్థితుల‌న్నీ చూస్తుంటే రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్ రెడ్డి గెల‌వ‌టం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం ఏమీకాద‌ని అంటున్నారు. లేదంటే ఎన్నిక‌ల‌కు ఛాన్స్ లేని స‌మ‌యం వ‌ర‌కూ వేచిచూసి రాజీనామా చేసి బిజెపిలో చేర‌టం ఓ మార్గం అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అంటే అప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ లోనే ఉండి..టీఆర్ఎస్ ఓడించేది బిజెపి మాత్ర‌మే అని చెబుతూ ఉంటారు..కాంగ్రెస్ చూస్తూ ఉంట‌దా అన్న సంగ‌తి తేలాల్సి ఉంది.

Next Story
Share it