కెసీఆర్ పై మోత్కుపల్లి ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన దళిత సాధికారికత సమావేశాన్ని బిజెపి బహిష్కరించాలని నిర్ణయించింది. అయినా మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశానికి హాజరై తన అభిప్రాయాలు చెప్పటంతో పాటు కెసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సీఎం కెసీఆర్ తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైందన్నారు.
దళితుల్లో ఆయన మీద విశ్వాసం పెరిగిందన్నారు. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా కెసీఆర్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంందని పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని ..మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజం లో వొక మానసిక ఉత్తేజం కలిగింది. అందుకు మీకు ధన్యవాదాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని కోరారు.