ఈటెలను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలి
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఆయన టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన దళితులకు పిలుపు ఇచ్చారు. గురువారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ దళిత బంధును అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళితులు బాగుపడితే బానిసలుగా ఉండరని భావిస్తున్నారని, అఖిలపక్షం దళిత బంధును స్వాగతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ అవినీతిపరుడని, పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమి సంపాదించారని విమర్శించారు.
40 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమని ఆయనే చెప్పారని, ఆ భూమిని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలని హుజూరాబాద్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉప ఎన్నికలో ఆయనను ఓడించాలన్నారు. ఈటెల భూములను తిరిగి ఇచ్చేయాలని లేకుంటే ఆ భూముల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకానికి మద్దతుగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈటల చేస్తున్న మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.