Telugu Gateway
Politics

వ‌చ్చే ఏడేళ్ళ‌లో ద‌ళిత‌బంధుకు 1.70 లక్షల కోట్లు

వ‌చ్చే ఏడేళ్ళ‌లో ద‌ళిత‌బంధుకు 1.70 లక్షల కోట్లు
X

టీఆర్ఎస్ లో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత‌బంధుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడేళ్ళ‌లో రాష్ట్ర బ‌డ్జెట్ 23 లక్షల కోట్ల రూపాయ‌లు ఉంటుంది. అందులో 1.70 లక్షల కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌నే ఆలోచ‌న ఉంది. ఈ లక్షల కోట్ల పెట్టుబ‌డి ప‌ది లక్షల కోట్లు సంపాపాదిస్తుంద‌ని తెలిపారు. వ‌చ్చే ట‌ర్మ్ లోనూ టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలిపారు. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ కు రాజ‌కీయం ఓ యజ్ఞం అని..ఇత‌రుల‌కు ఆట అని వ్యాఖ్యానించారు. మోత్కుప‌ల్లి చేరిక సంద‌ర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ ఈ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అని వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ప్ర‌జా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని, విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారని కేసీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే కాకుండా అణ‌గారిన ప్ర‌జల గొంతుగా నిలిచి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ స‌మాజం అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను అనుభ‌వించిందని ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. అప్పట్లో న‌ర్సింహులు విద్యుత్‌శాఖ మంత్రిగా ఉండగా తనను క‌లిసిన‌ప్పుడు క‌రెంట్ బాధ‌లు ఉన్నాయ‌ని చెప్పారని, ఆలేరు అంతా క‌రువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

'దళిత బంధు యజ్ఞంలా కొనసాగుతోంది. దళిత బంధు ఇక్కడికే ఆపం, ముందు ముందు కొనసాగిస్తాం. దళిత బంధు అమలు చేయాలని నాకు ఎవరు చెప్పలేదు. నాకే ఆలోచన వచ్చింది. దీని గురించి మొదటి కాల్‌ మోత్కుపల్లికే చేశాను. తెలంగాణ లో పెద్ద కులం దళిత కులమే. 75 లక్షల జనాభా ఉంది. కానీ వాళ్లకు 25 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయి. పోడు భూముల సమస్యలు పరిష్కరించుకుందాం. బంతిలో కూసుంటే.. ఏదో ఒక కొసకెళ్లి వడ్డిస్తారు. అలాగే దళిత బంధు కూడా అంతే. పార్టీలు, రాజకీయాలు కాకుండా కేవలం దళితులైతే చాలు. దళిత బంధు అందుతుంది. ఆరు నూరైనా దళిత బంధు అందరికి అమలు చేస్తాం. .దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తాం' అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఆయ‌న‌కు ఏదో ఒక కీల‌క ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Next Story
Share it