మమతా..మోడీల మధ్య మరింత ముదురుతున్న వివాదం
కేంద్రంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ సారి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో వివాదం కొత్త మలుపు తిరిగింది. మమత వినతి మేరకు సీఎస్ కు మూడు నెలలు పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం ఇప్పుడు ఆయన విషయంలో కఠిన వైఖరి తీసుకుంది. దీనికి కారణం యస్ తుఫాను సందర్భంగా ప్రధాని మోడీ పర్యటనలో మమతా బెనర్జీ, సీఎస్ వ్యవహరించిన తీరే కారణం అన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కూడా పెద్ద దుమారం రేపింది. మమతా ప్రధాని మోడీని అవమానించారు అని బిజెపి విమర్శలు చేస్తే స్వయంగా మమతే రంగంలోకి దిగి ఎందుకు తనను ఇంతలా అవమానిస్తున్నారు...ప్రజల తీర్పును గౌరవించటం నేర్చుకోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంతే కాదు..అవసరం అయితే పశ్చిమ బెంగాల్ ప్రయోజనాల కోసం మోడీ కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ పరిణామాల అనంతరం కేంద్రం సడన్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపాలని..ఆయన డీవోపీటీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని మమతా తీవ్రంగా తప్పుపట్టారు. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ కూడా రాశారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ తరుణంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రానికి ఝలక్ ఇచ్చేందుకు ఏకంగా పదవీ కాలం పొడిగించిన సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయను తన పదవికి రాజీనామా చేయించి తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారం ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు. అయితే కేంద్రానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలను ఉల్లంఘించటంతో ఆలాపన్ బందోపాధ్యాయను డీవోపీటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆయన సలహాదారుగా మారిపోవటంతో కేంద్రం ఈ విషయంలో ఎలా ముందుకెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.