మోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన రాజకీయ కాక రేపుతోంది. అధికార టీఆర్ఎస్, బిజెపిల మధ్య తీవ్ర విమర్శలకు కారణమైంది. ఓ వైపు సీఎం కెసీఆర్ ప్రధాని హైదరాబాద్ రావటానికి కొద్ది గంటల ముందే బెంగుళూరు బయలుదేరి వెళ్లగా..ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధిస్తూ నగరంలోని 17 చోట్ల పలు ఫ్లెక్సీలు వెలిశాయి. కాళేశ్వరంకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించటంతోపాటు విభజన హామీలను ఎందుకు అమలు చేయటం లేదంటూ ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీతోపాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. అయితే అధికార టీఆర్ఎస్ తీరుపై బిజెపి మండిపడింది. ఇది ప్రధాని మోడీని అవమానించటమే అని విమర్శలు గుప్పించింది. ఏమి తప్పు చేశారో తెలియదు కానీ..ప్రధాని వచ్చిన ప్రతిసారి ఇలా సీఎం కెసీఆర్ రాష్ట్రం వదిలి పారిపోతున్నారని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఏదైనా ఉంటే ప్రధాని మోడీని కలిసి అడగాలి కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు. బేగంపేట విమానాశ్రయానికి తమ కార్యకర్తలను అనుమతించకపోతే ఇక్కడి నుంచి నేరుగా డీజీపీ ఆఫీస్ కు తమ ధర్నా కొనసాగుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. తమ కార్యకర్తలను అడ్డుకుంటే సహించేదిలేదని హెచ్చరించారు. ట్విట్టర్ లో కూడా కొంత మంది మోడీ గో బ్యాక్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. అదే సమయంలో బిజెపి కార్యకర్తలు షేమ్ ఆన్ కెసీఆర్..ప్రధాని వస్తుంటే ప్రోటోకాల్ పాటించకుండా పారిపోతారా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఐఎస్ బీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ గురువారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుంటున్నారు. మొత్తానికి మోడీ టూర్ రాజకీయ వేడి మరింత పెంచుతోంది. సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా ప్రధాని మోడీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.