రవిశంకర్ ప్రసాద్..ప్రకాష్ జవడేకర్ లకు మోడీ షాక్
కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని వారు కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ విధానం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరుణంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పై వేటుపడింది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనూహ్యంగా కేంద్ర ఐటి, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందే సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ చౌబే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
వచ్చే ఏడాది జరిగే శాసన సభ ఎన్నికలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మోదీ తన మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారని అంచనా. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి నిర్మలా సీతారామన్ పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల ప్రయోజనాలు కూడా ఎవరికి చేరుతున్నాయో తెలియటం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆర్ధిక శాఖ నిర్మలా సీతారామన్ దగ్గరే ఉంటుందా లేక మార్పు జరుగుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.