Telugu Gateway
Politics

ప్రతిపక్షాలు దూకుడు పెంచే ఛాన్స్

ప్రతిపక్షాలు దూకుడు పెంచే  ఛాన్స్
X

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విషయం బయటపడింది. ఎన్నికల ఏడాదికి ముందు నుంచే వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అబ్ కీ బార్, చార్ సౌ పార్ నినాదాన్ని హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారం ద్వారా ఒక రకమైన పాజిటివ్ మూడ్ క్రియేట్ చేసుకోవటంలో బీజేపీ..ప్రధాని మోడీ కొంత వరకు సక్సెస్ అయ్యారు. అయినా సరే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరం అయిన మెజారిటీ కోసం ఎన్డీఏ మిత్రపక్షాల మెజారిటీ పై ఇప్పుడు బీజేపీ ఆధారపడిన విషయం తెలిసిందే. అప్పుడే మోడీ మ్యాజిక్ తగ్గిపోయింది అన్న విషయం తేలిపోయింది. అయితే ఇప్పుడు మరో సారి ఈ విషయం స్పష్టం కాబోతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ తో గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ అన్ని తేల్చిచెపుతున్నాయి. ఈ విషయంలో నంబర్లు తేడాఉండొచ్చు కానీ...అందరిది ఒకటే మాట...అది హర్యానా కాంగ్రెస్ దే అని. మరో వైపు జమ్మూ కాశ్మీర్ లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికే ఛాన్సులు ఎక్కువ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంత మంది మాత్రం హంగ్ అని చెపుతున్నారు.

ఎన్నికలు జరిగిన రెండు చోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సులు లేవు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉండే హర్యానా లో మూడవసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించినట్లు కనిపించటం లేదు. మరో వైపు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక రాష్ట్రం అయిన మహారాష్ట్ర లో కూడా బీజేపీ గెలుపు సాధ్యం కాదు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర లో బీజేపీ, శివసేన (షిండే వర్గం) , ఎన్సీపీ చీలిక గ్రూప్ తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అధికారం కోసం బీజేపీ చేసిన ఈ చీలికల రాజకీయమే వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ని దారుణంగా దెబ్బకొట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానా లో కాంగ్రెస్ విజయం సాధించి...మహారాష్ట్ర లో కూడా బీజేపీ ఓటమి పాలు అయితే మోడీ కి రాజకీయంగా మ్యూజిక్ స్టార్ట్ అయినట్లు అవుతుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల ఫలితాలతోనే మోడీ ఇమేజ్ పడిపోయింది అన్న అభిప్రాయం ఏర్పడింది. మోడీ సారథ్యంలోని బీజేపీ కి వరస ఓటములు ఎదురైతే కేంద్రంలోని ప్రభుత్వం కూడా గతంలో లాగా నిర్ణయాల్లో దూకుడు చూపించే అవకాశం ఉండదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఏ పార్టీ పై అయినా ప్రజల్లో అభిప్రాయం మారటం స్టార్ట్ అయితే ఆ పార్టీ పతనం కూడా అంతే వేగంగా ఉంటుంది అన్ని నిపుణులు చెపుతున్నారు. మరి ఈ పరిస్థితులను అధిగమించటానికి మోడీ ఏమీ చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it