జనసేన లో భూ సెటిల్మెంట్స్ కలకలం?!

నాయకత్వం ఎలా ఉంటుందో ..ఎమ్మెల్యేలు కూడా అలాగే వ్యవహరిస్తారు.ఎందుకంటే ఒకరి విషయాలు ఒకరికి పక్కాగా తెలుస్తాయి కాబట్టి. గత కొన్ని రోజులుగా జనసేన లో భూ సెటిల్మెంట్స్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అంత కంటే ముందు స్వయంగా జనసేన, అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా క్యాబినెట్ సమావేశంలోనే ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ప్రైవేట్ ల్యాండ్స్ సెటిల్మెంట్స్ విషయంలో కూడా కొంత మంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు అని...ఇందులో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక్క జనసేనలోనే కాదు...టీడీపీ కి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలపై కూడా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యేల విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో ప్రస్తావించిన తర్వాత వైజాగ్ లో చోటు చేసుకున్న భూ వివాదం సెటిల్మెంట్ కు సంబదించిన అంశం పత్రికల్లో వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఒక పార్టీ అధినేతకు చెందిన సన్నిహితుడు ఈ వ్యవహారంలో రంగంలోకి దిగారు. అక్కడే ఎమ్మెల్యే జోక్యం చేసుకోవటంతో అయన నేరుగా ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏమిటి అంటే ఈ తాజా పరిణామాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పై స్థాయిలో వాళ్ళు చేసుకునేవి చేసుకుంటూ కూడా...మళ్ళీ తమ వాళ్ళతో తమ దగ్గర దందాలు చేయించటం ఏంటి అని ఒక నేత తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవహారం గ్రహించిన అధిష్ఠానం పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నం చేసింది.
జనసేన కు చెందిన ఒక మంత్రి ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలతో వైజాగ్ లో సమావేశం అయి ఈ భూ వివాదాలు బయటకు రాకుండా చూడాలని కోరినట్లు సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఆ మంత్రి తన కార్లు కూర్చోబెట్టుకుని ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. తర్వాత కొంత మంది ఈ ఆరోపణలు వెనక కుట్ర ఉంది అని కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కుట్ర ఆరోపణలు చేస్తే కొంతలో కొంత నమ్మటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కుట్ర ఆరోపణలు చేయటం అంటే ఇది విచిత్రం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి జోక్యం తో ప్రస్తుతానికి ఎమ్మెల్యే లు భూముల పంచాయతీ సర్దుకొంటుందా...లేక రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందా అన్నది చూడాలి.



