మోడీ అప్పటి మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి
కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. ప్రధానంగా పెట్రో దరల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రధాని మోడీ ప్రతిపక్షంలో ఉండగా ఈ అంశంపై చేసిన విమర్శలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. పెట్రో ధరలను వరస పెట్టి పెంచుతున్న అంశంపై కెటీఆర్ కేంద్రానికి సుదీర్ఘ లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజేపీదే అని విమర్శించారు. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుందన్నారు. ప్రతీది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుందని తప్పుపట్టారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం అని హెచ్చరించారు. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్రమోడీ, అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్కచేయకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ళ నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటున్నది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రేయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేటు మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పకనున్న దాయాది దేశాలతోపాటు, ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
2014 లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కానీ, కరోనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం తగ్గిన ధరల ప్రయోజం ప్రజలు పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొందలేకపోతున్నారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రూ.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజు పెట్రోల్ 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది.
అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాని 2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు. రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారన్నారు. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాల పై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటలను ప్రజలు సీరియస్ గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వం పై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తదని హెచ్చరించారు.