తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో బండి సంజయ్ డ్రామా
ఉద్యోగాల కల్పన విషయంలో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ ఈ నెల 27న నిరుద్యోగ దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని బిజెపి విమర్శిస్తోంది. ఈ విమర్శలపై ఎదురుదాడి చేస్తూ తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో బిజెపి, బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అంటూ మండిపడ్డారు. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి 'రాజకీయ ఉద్యోగం' లేక చేస్తున్నదే 'మీ నిరుద్యోగ దీక్ష.' అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ కల్పనలో తాము సాధించిన అత్యద్బుత విజయాలు మీకు తెలిసినవే అయినా తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో డ్రామా దీక్షకు దిగారు. మీ కోసం మళ్లీ ఆ విజయాలను క్లుప్తంగా గుర్తు చేస్తాను అంటూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి లక్ష ముప్ఫై మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది మా టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
విప్లవాత్మకమైన టిఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన చేసింది ఈ ప్రభుత్వంకాదా... వచ్చిన ఉద్యోగావాకాశాలను తెలంగాణ యువతకు దక్కేలా ప్రత్యేక శిక్షణ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ని ఏర్పాటు చేసి మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది ఎవరు?. . టీఎస్ ఐపాస్ లెక్కలోకి రాని మరెన్నో లక్షల ఉద్యోగాలను ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా సృష్టించినది తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది.
మీ బీజేపీ పాలిత యూపీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పిడికెడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లక్షల మంది నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసిన దుర్మార్గం కనిపించని కళ్లులేని కబోదులు మీరు. సాఫీగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టిన మీ డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా... ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమను, ఉద్యోగులను అదుకునేందుకు అర్ధిక ప్యాకేజీలిస్తే... 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా..సర్కారువారి పాట బెట్టి మీ ఘనమైన మోడీ.. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్/ సీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన మీది కాదా అని మండిపడ్డారు.