Telugu Gateway
Politics

జగదీష్ రెడ్డి చెబుతున్న 'దుబ్బాక నిర్లక్ష్యం' ఎవరది?

జగదీష్ రెడ్డి చెబుతున్న దుబ్బాక నిర్లక్ష్యం ఎవరది?
X

నిర్లక్ష్యంతోనే దుబ్బాక ఓటమి

దుబ్బాక ఉప ఎన్నికపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యంతోనే తాము దుబ్బాకను పొగొట్టుకున్నాం తప్ప మరొకటి కాదని అన్నారు. దుబ్బాక చాలా చిన్న ఎన్నిక అని..గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే జీహెచ్ఎంసీలో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని అన్నారు. దుబ్బాక ఎన్నికకు సంబంధించి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఒక్కరే చూశారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ లు అటువైపు కూడా చూడలేదు.

ఎన్నికల సమయంలో వీరంతా బిజెపి, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని ప్రకటించారు. మరి ఇప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే దుబ్బాకలో ఓటమి పాలు అయ్యాం అని చెబుతున్నారంటే ఈ నెపం మొత్తాన్ని ఆయన ఎవరిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు?. నిర్లక్ష్యం మంత్రి హరీష్ రావుదా? లేక అసలు అటువైపు కూడా కన్నెత్తి చూడని పార్టీ పెద్దలదా?. దుబ్బాక ఫలితాన్ని తక్కువ చేసి చూపించేందుకు టీఆర్ఎస్ నేతలు ఇఫ్పుడు నానా తిప్పలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చూస్తుంటే మంత్రులు కొత్త కొత్త వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it