ఇద్దరు మంత్రుల అరెస్ట్..సీఎం ఫైర్
ఎన్నికలు ముగిసినా పశ్చిమ బెంగాల్ లో మాత్రం రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. సోమవారం నాడు అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి దమ్ముంటే తననూ అరెస్ట్ చేయాలంటూ సీఐబీకి సవాల్ విసిరారు. అంతే కాదు..మమతా స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మరింత వేడెక్కింది. పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్ పై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. మంత్రులతోపాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి.
ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. 2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో వీరంతా కెమెరా ముందే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని.. ఓటమితో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.