బిజెపి సర్కారు కుప్పకూలితేనే ప్రజాస్వామ్యం బతికేది
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో రాజ్ భవన్ హైదరాబాద్ లో ఉద్రిక్తతకు దారితీసింది. పెగాసెస్ స్పైవేర్ తో దేశంలోని ప్రతిపక్ష నేతలతోపాటు జడ్జీలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయిన విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు సమావేశం పెట్టుకుని రాజ్ భవన్ కు బయలుదేరారు. మార్గమధ్యంలోనే వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు,పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ సందర్బంగా సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 'బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. స్వేఛ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుంది. స్వాతంత్ర్యం తెచ్చుకున్నదే..స్వేచ్ఛ కోసం.. ఇప్పుడు ఆ స్వేచ్ఛ నే హరించేశారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు , ప్రతిపక్ష పార్టీ ల ముఖ్య నేతల ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయి.
కెనడా దేశ ముఖ్య సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించింది. టెర్రరిస్టుల సమాచారం తెలుకునేందుకు వాడే సాఫ్ట్ వేర్ ను..ప్రతిపక్షాల పై న ఈ ప్రభుత్వం వాడుతుంది. టెర్రరిస్టులను అంత మొందించాల్సింది పోయి..ప్రతి పక్షాల ను అంత మొందిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు లేకుండా చేసి , నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఈ దేశానికి స్వేచ్ఛ ను తీసుకువచ్చింది కాంగ్రెస్.. బీజేపీ ఆ స్వేచ్ఛ ను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. పోలీసుల అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నా' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సీతక్క, మహేశ్వర్ రెడ్డి, మల్లు రవి తదితర నేతలు ఉన్నారు.