దేశాన్ని లూటీ చేసి..దోస్తులకు పంచిపెట్టే పనిలో మోడీ
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే కేంద్రం తాజాగా ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టును తీవ్రంగా తప్పుపట్టారు. దేశాన్ని లూటీ చేసి ప్రధాని మోడీ తన దోస్తులకు పంచి పెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. దీన్ని తాము అడ్డుకుని తీరతామని ప్రకటించారు. ఖర్గే శుక్రవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు లక్షల కోట్ల రూపాయల నిధుల సమీకరణకు జాతి సంపదను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. దీని వల్ల దేశానికి, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ 3.50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మేశారని ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు నెహ్రు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారన్నారు.
1991లో పీ వీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో సంస్కరణలు తెచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించటం వల్ల మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ వస్తుందనేది నెహ్రు అభిప్రాయం అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. మోడీ తీరు చూస్తుంటే రిజర్వేషన్లకు మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసినట్లు కన్పిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసందను కాపాడితే మోడీ వాటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.