అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా
మహారాష్ట్రలో కీలక పరిణామం. ముంబయ్ హైకోర్టు తీర్పుతో హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. దేశ్ ముఖ్ పై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు అనిల్ దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ థాకరేకు పంపించారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు.
నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ పదేపదే మంత్రి అనిల్ కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పినట్లు' పరమ్‌బీర్ సింగ్ లేఖలో తెలిపారు.అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇంకా ఆమోదించలేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామాకు అంగీకారం తెలపడంతోనే అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.