రాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరినట్లే కన్పిస్తోంది. ఎవరికి వారు వ్యూహాలు..ప్రతి వ్యూహాలు రచించుకునే పనిలో ఉన్నా.శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించే అవకాశాం కన్పించటం లేదు. విచిత్రంగా రెబల్ ఎమ్మెల్యేలు కూడా తాము శివసేనకు వ్యతిరేకం కాదని..ఎన్సీపీ, కాంగ్రెస్ తీరుతోనే విసిగిపోయామని ప్రకటించటం ఈ ఎపిసోడ్ లో ఓ హైలెట్ గా చెప్పుకోవచ్చు. అసమ్మతి గ్రూప్ కు నాయకత్వం వహించిన ఏకనాథ్ షిండే మాటలు చూస్తుంటే ఈ వ్యవహారం అంతా బిజెపినే వెనక ఉండి నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజానికి బిజెపి ఎప్పటి నుంచో ఈ సంకీర్ణ సర్కారును పడగొట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు అది ఓ కొలిక్కివచ్చినట్లు కన్పిస్తోంది. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా సాఫీగా సాగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పిన సీఎం.. ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. 'హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. దేశంలో టాప్-5 సీఎంలలో నేను ఒకడిని. బాల్‌థాకరే వారసత్వాన్ని కొనసాగించేది మేమే. నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలను కలవలేకపోతున్నా. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం' అని సీఎం పేర్కొన్నారు. '30 ఏళ్లుగా మేము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించాం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని అడిగారు.
ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా. ఎన్సీపీ, కాంగ్రెస్ నాకు పూర్తి సహకారం అందించాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యా. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గవర్నర్‌కు కూడా తెలియజేశా. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది' అని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్‌నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్‌నాథ్ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. శివసేన పార్టీని నడిపేందుకు నేను పనికిరానని చెప్పండి.. పార్టీ నుంచి తప్పుకుంటా. పదవులు వస్తాయి.. పోతాయి. అధికారం కోసం నేను పాకులాడటం లేదు అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఉద్థవ్ ఠాక్రే వ్యాఖ్యలపై మరి రెబల్ క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. బిజెపితో కలవటానికి సిద్ధపడితే తాము అంతా వెనక్కి వస్తామని ఏకనాథ్ షిండే చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి.