Telugu Gateway
Politics

కాంగ్రెస్ అంటేనే అన్ని కులాల క‌ల‌యిక‌

కాంగ్రెస్ అంటేనే అన్ని కులాల క‌ల‌యిక‌
X

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ర‌చ్చ ప్రారంభం అయింది. కొద్ది రోజుల క్రితం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఇప్పుడు వాటిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ సుదీర్ఘ లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు...' కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయికనే కాంగ్రెస్ పార్టీ. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధిభి మోగించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదు అనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమే. బహుశా మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ చారిత్రక విషయాలను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, నక్సల్బరీ ఉద్యమం.. తొలిదశ, మలిదశ ఉద్యమాలు భూమి కోసం ఆత్మగౌరవం కోసం.. నిజాం పాలనకు, జమీందారుల దోపిడీలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగాయి. దొరలకు, గడులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలే.

రావినారాయణ రెడ్డి, సురవరం ప్రతాప రెడ్డి, కొండపల్లి సీతారామయ్య, సీహెచ్ రాజేశ్వర రావు వంటి అభ్యుదవ భావాలు కలిగిన అగ్రకులాల నాయకులు బడుగులతో కలిసి అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను సైతం మీరు వ్యతిరేకిస్తున్నట్లు మీ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం పదవులు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇది అత్యంత దారుణం. ఖండిచతగ్గ విషయం. ఒక్క రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే.. సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైంది. అంతేకాక డీకే అరుణ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూడా స్వయంగా ఓటమి పాలయ్యారు. అంతేకాక ఉత్తమ్ పద్మావతి రెడ్డి 2018లో కోదాడ లోనూ, తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ, సీనియర్ అయిన కె జానారెడ్డి 2018 ఎన్నికల్లోనూ, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీసీ యువకుడి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. 1999లోనూ ఇదే జరిగింది. సీఎల్పీ నేతగా పి. జనార్ధన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళినా ఓటమి పాలైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ ఆందోళనను గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా.' అంటూ పేర్కొన్నారు.

Next Story
Share it