Telugu Gateway
Politics

బండి సంజయ్ కు లీగ‌ల్ నోటీసులు పంపిన కెటీఆర్

బండి సంజయ్ కు లీగ‌ల్ నోటీసులు పంపిన కెటీఆర్
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ వ‌ర్సెస్ బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ ల మ‌ధ్య రాజ‌కీయ వార్ కొత్త మ‌లుపు తిరిగింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా బండి సంజ‌య్ ఇటీవ‌ల మంత్రి కెటీఆర్ పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. కెటీఆర్ నిర్ణ‌యం వ‌ల్ల 27 మంది ఇంట‌ర్ విద్యార్ధులు చ‌నిపోయినా సీఎం కెసీఆర్ అస‌లు స్పందించ‌లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు . దీనిపై స్పందించిన కెటీఆర్..ఆధారాలు ఉంటే నిరూపించాల‌ని..లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజే మంత్రి కెటీఆర్ త‌న న్యాయ‌వాది ద్వారా లీగ‌ల్ నోటీసులు పంపారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని న్యాయ‌వాది త‌న నోటీసులో పేర్కొన్నారు .

ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా... కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు. మంత్రి కేటీఆర్ పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని అన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే త‌దుప‌రి చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. మ‌రి ఈ నోటీసుపై బండి సంజ‌య్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it