Top
Telugu Gateway

ఎన్నికలకు ముందే కెటీఆర్ విశాఖ వెళ్ళాలి

ఎన్నికలకు ముందే కెటీఆర్ విశాఖ వెళ్ళాలి
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అలీబాబా అరడజను దొంగలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. పరిశ్రమల భూముల్ని రియల్ ఎస్టేట్‌కు అమ్మేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ ద్వారా భారీ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. దోపిడీకి సహకరించడానికి సోమేశ్‌కు సీఎస్‌ హోదా ఇచ్చారని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడుతున్న కెటీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే విశాఖ వెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని అన్నారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.

2018 నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతున్నారని, సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని అన్నారు. 2018 జులై2న టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ ఐటిఐఆర్ పై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని..నిధుల విడుదల గురించి ఎప్పుడూ అడగలేదని తెలిపారన్నారు. అంతే కాకుండా 2008లో తీసుకొచ్చిన ఐటిఐఆర్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్ సభలోనే ప్రకటించారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే బిజెపి, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Next Story
Share it