Telugu Gateway
Politics

మార్చిలోపు ముఖ్యమంత్రి సీటులో కెటీఆర్

మార్చిలోపు ముఖ్యమంత్రి సీటులో కెటీఆర్
X

సలహా మండలి బాధ్యతలు చేపట్టనున్న కెసీఆర్ !

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు మంత్రి కెటీఆర్ కు అప్పగిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి కెసీఆర్ తన డిల్లీ పర్యటన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పి..తనకు సహకరించినట్లే కెటీఆర్ కు కూడా అండదండలు అందించాల్సిందిగా కోరినట్లు బిజెపి వర్గాలు కూడా చెబుతున్నాయి. తెలంగాణ కేబినెట్ లోని మంత్రులు కూడా అప్పుడప్పుడు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని ఆయనకు లైన్ క్లియర్ చేస్తూ వచ్చారు. అంటే కెటీఆర్ కు మద్దతు ఉందని చెప్పేందుకే ఇలాంటి ప్రకటనలు చేయించినట్లు పార్టీ వర్గాలు అంచనా. ఇప్పుడు తాజాగా సీనియర్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చిలోపు కెటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. తన నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై కోరిన విషయాన్ని వెల్లడిస్తూ కెటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి కెటీఆర్ సీఎం అంశం చర్చనీయాంశంగా మారింది.

కొత్తగా ఎమ్మెల్సీ అయిన కవితకు మంత్రివర్గంలోకి తీసుకోవటం కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుటుంబ కుటుంబ పాలన అంటూ బిజెపి తీవ్ర విమర్శలు చేస్తోంది. అందుకే సీఎం పదవి నుంచి కెసీఆర్ తప్పుకుని.. కెటీఆర్ ను సీఎం చేయటంతోపాటు కవితకు మంత్రి కూడా అప్పగిస్తారని చెబుతున్నారు. దీంతో ఇఫ్పుడు ఉన్నట్లే ప్రభుత్వంలో ఇద్దరే ఉంటారు కాబట్టి విమర్శల డోస్ పెద్దగా పెరగటానికి ఛాన్స్ ఉండదని ఓ లెక్క. అయితే సీఎం పదవి నుంచి తప్పుకున్నాక కెసీఆర్ ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే సీఎం కెసీఆర్ సలహామండలి పేరుతో ఒక పోస్టును సృష్టించుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో దీనికి సంబంధించిన పరిణామాలు చకచకా ముందుకు సాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it