Telugu Gateway
Politics

గంటల వ్యవధిలో మాట మార్చిన కోమటిరెడ్డి

గంటల వ్యవధిలో మాట మార్చిన కోమటిరెడ్డి
X

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివర్స్ గేర్ వేశారు. అందరిలాగే నా మాటలు వక్రీకరించారు అనే మాటతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ వేదికగా వెంకటరెడ్డి చేసినా వ్యాఖ్యలు దుమారం రేపటంతో పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. సహజంగా ఎప్పుడూ అసమ్మతి వర్గం వైపు ఉండే వి. హనుమంతరావు వంటి నేతలు కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇతర నేతలు కూడా కోమటిరెడ్డి తీరును తప్పుబడుతూ ఎటాక్ చేశారు. ఇదే అదనుగా బీజేపీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ ను వాడుకునే ప్రయత్నం చేసింది. తాము ముందు నుంచి చెపుతున్నట్లు బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అంటూ విమర్శలు గుప్పించింది. ఇది కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట మార్చారు. తెలంగాణ హంగ్ వస్తది అని తాను చెప్పలేదు అన్నారు తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా ఉంటుందన్నా.. అర్ధం చేసుకునేదాన్ని బట్టి ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.

సోషల్‌ మీడియా సర్వేలను బట్టి మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీట్లపై వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ పార్టీకి లేదని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని తెలిపారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తానని ఠాక్రే తెలిపారు. పొత్తులపై రాహుల్‌ వరంగల్‌ సభలో చెప్పిందే ఫైనల్‌ అని ఠాక్రే స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా చర్యలు, మాటలను పార్టీ అధినాయకత్వం నిశితంగా గమనిస్తుందని అన్నారు. ఈ విషయాలన్నింటిపైనా అధిష్టానం పరిధిలోనే నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్రలో ప్రజలు తనకు వివరించే సమస్యల మీదే ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it