సర్వనాశనం అయిన పార్టీలో ఆయనే 'స్టార్ క్యాంపెయినర్!'
అంతా పక్కా ప్లాన్ ప్రకారం. ఏజెండా ప్రకారమే. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కొద్ది రోజుల క్రితమే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు తనకు మునుగోడు ప్రచారంతో సంబంధంలేదని..హుజూరాబాద్ తరహాలో ఇక్కడ కూడా మూడు వేలో..నాలుగు వేలో ఓట్లు తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. స్వయంగా ఆయనే ప్రచారం చేస్తానన్నారు..ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న పార్టీనే రాష్ట్రంలో సర్వనాశనం అయిందని వ్యాఖ్యానించటం కాంగ్రెస్ శ్రేణులు కూడా షాక్ కు గురిచేసిందనే చెప్పొచ్చు. మునుగోడులో బిజెపి నుంచి పోటీచేసేది తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావటంతో ఆయన సొంత పార్టీకి పనిచేయరనే ఊహగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
వాటిని నిజం చేస్తూ తాజాగా ఆయనే స్వయంగా తాను మునుగోడు ప్రచారానికి వెళ్ళనని ప్రకటించారు. మరోసారి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన తీరు చూస్తుంటే కాంగ్రెస్ ను వీడేందుకే ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఠాకూర్ ను తీసేసి..కమల్ నాథ్ లాంటి సీనియర్లను ఇన్ ఛార్జిగా పెట్టాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతే కాదు..పీసీసీ ప్రెసిడెంట్ ను మారిస్తేనే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఒక ఏజెండా ప్రకారమే ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి మరింత నష్టం చేసి..తర్వాత ఆయన తన దారి తాను చూసుకుంటారనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. సోమవారం నాడు ఢిల్లీలో ప్రియాంక గాంధీ మునుగోడు ఉప ఎన్నికపై చర్చించేందుకు సమావేశం పెట్టినా కూడా ఆయన దీనికి దూరంగా ఉన్నారు.