రేవంత్ రెడ్డి పక్కకు చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
కాంగ్రెస్ లో కీలక పరిణామం. సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పక్కకు చేరారు. ఇంత కాలం ఆయనతో ముఖాముఖి సమావేశానికి...ఆయన్ను కలవటానికి కూడా ఆసక్తిచూపించని కోమటిరెడ్డి శనివారం నాడు హైదరాబాద్ లో పార్టీ నిర్వహించిన వరి దీక్షలో ఒక్కటయ్యారు. ఇద్దరూ పక్కనే పక్కనే కూర్చుని పలకరించుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ నేతలతోపాటు క్యాడర్ లో కూడా కొత్త ఉత్సాహన్ని ఇచ్చిందనే చెప్పొ్చ్చు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు..పదవులు అమ్ముకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు ఇది. అయితే మధ్యలో ఆయన్ను బుజ్జగించే బాధ్యతను అధిష్టానం సీనియర్ నేత విహెచ్ కు అప్పగించింది. కారణాలు ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వరి దీక్షలో పాల్గొనటం ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు.
టీపీసీసీ తెలంగాణలో రైతుల దగ్గర వరి కొనాలంటూ శని, ఆదివారాలు దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంత కాలం పార్టీ నిర్వహించే ఎంత పెద్ద కార్యక్రమానికి కూడా కోమటిరెడ్డి హాజరు కాలేదు. శనివారం ఉదయమే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెడలో సీనియర్ నేత వి హనుమంతరావు ఆకుపచ్చ కండువావేసి దీక్షను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి, వి.హెచ్, సీతక్క, చిన్నారెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ ముఖ్య నేతలు దీక్షలో కూర్చున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ధర్నాలో పాల్గొన్న విహెచ్ మాట్లాడుతూ రెండు నెలలుగా వరి ధాన్యం కొనడం లేదని.. రైతులు వరి కుప్పలమీద మరణిస్తున్నారని విమర్శించారు.
పండించిన పంటను కొనడం ఆపేసి కేసీఆర్ ఢిల్లీ బాటపడుతున్నారని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మరిచిపోతోందన్నారు. దేశంలో రైతులకు సంకెళ్లు వేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని వీహెచ్ విమర్శించారు. తరుణ్ చుగ్‌కు అసలు తెలివి ఉందా? లేక మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలుపుతో ఆగట్లేదని వీహెచ్ అన్నారు. కేసీఆర్ ఇందిరాపార్క్‌లో ధర్నా చేసిన రోజు తనకు సంతోషం అనిపించిందన్నారు. రాచకొండ అడవుల్లో ధర్నా చౌక్ ఉండాలన్న కేసీఆర్ ఇందిరాపార్కులో ఎందుకు ధర్నా చేశావ్? అని ప్రశ్నించారు. మూడు రోజులు ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఏం సాధించావ్? అని నిలదీశారు.